Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

చరిత్రకారులను చిక్కు పెడుతూ ఉన్న శ్రీ శంకరుల కాలం

భగవత్పాదులు వైశాఖ శుద్ద పంచమినాడు అవతరించేరు. వారు జన్మించిన సంవత్సరం 'నందన'. జన్మనక్షత్రం ఆర్ద్ర. అయితే వారు ఏ నందనలో జన్మించేరు? అన్నది ఆచార్యుల వారి కాలం నిర్ణయించినమీదటే తెలుస్తుంది.

ఆచార్యులవారి కాలాన్ని గూర్చి పలువిధాలైన అభిప్రాయాలు ఉన్నాయి. వీనిలో ఒకదానికి వేరొకదానికి వ్యత్యాసం కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. కొందరు క్రీ||పూ|| ఎన్మిదవ శతాబ్దం ఆచార్యుల కాలం అని అంటే మరికొందరు అది కాదు, క్రీ|| వెనుక ప్రథమశతాబ్దమే వారి కాలం అంటున్నారు. ఈ రెండు అభిప్రాయాలే కాదు, ఆచార్యులవారు క్రీ|| వెనుక ఐదవ శతాబ్దానికి చెందినవారు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇలా ఉన్న ఈ అభిప్రాయాలను పరికిస్తే వీని మధ్య దాదాపు 1000 సంవత్సరాల వ్యత్యాసం కనిపిస్తుంది.

'థియోసఫిష్టుల' పత్రికలో కీ||శే|| అయిన సర్‌ సుబ్రహ్మణ్యం అయ్యరుగారు ఆచార్యుల జననం క్రీ||పూ|| ఐదవశతాబ్దం అని సహేతుకంగా వ్రాసినారు. ద్వారకామఠంలోని ప్రమాణాలు ఆధారంగా స్వీకరిస్తూ వారు ఆచార్యుల కాలాన్ని ఈ విధంగా నిశ్చయించేరు.

శృంగేరీమఠంలో కొన్ని శాసనాలు ఉన్నాయి. అవి ఆచార్యులవారు క్రీ||పూ|| ఏడు లేక ఎనిమిదవ శతాబ్దములో జన్మించేరని నిశ్చయించేరు.

ఈ అభిప్రాయంలో ఆచార్యులకాలం క్రీ|| పూర్వం మొదటి శతాబ్దం అన్నభావం, ఐదవశతాబ్దం అన్న భావం శ్రుతిపరంపరగా చెప్పుకొనే మాటలమీదనే ఎక్కువ ఆధారపడి ఉన్నాయి కాని తగినంత దృఢమైన ఉపపత్తి కలవి కావు.

వీనిలో క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం ఆచార్యులవారి కాలంగా అంగీకరిస్తే కొన్ని చిక్కులు ఏర్పడుతున్నాయి. బుద్ధుడు క్రీస్తుకు పూర్వం నాల్గవ శతాబ్ధిలో ఉన్నారన్నది వ్యవహారంలో ఉన్నది. ఆచార్యులవారు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినవారని అంగీకరిస్తే వారున్ను, బుద్దుడున్ను సమకాలికులు కావలసి వస్తుంది. బౌద్ధమతం ఈ దేశంలో చిరకాలం ఉండి వైదికమతాన్ని అడుగంటజేసింది. అలా అడుగంటిపోయిన వైదకమతాన్ని ఆచార్యులవారు పునరుద్దరించేరు కదా! ఆచార్యులవారు బుద్ధుడు సమకాలికులు ఎలా కాగలరు?

కుమారిలభట్టు, ఆచార్యులవారు సమకాలికులు, కుమారిలభట్టు బౌద్ధమతాన్ని నిరాకరించి జనులను కర్మమార్గంలో ప్రవర్తింపజేసేరు. ఆచార్యులవారు కర్మమార్గాన్ని నిరసించి సర్వకర్మలూ ఈశ్వార్పణబుద్ధితో ఆచరింపబడాలి అంటూ అద్వైతమతాన్ని స్థాపించేరు. కుమారిలభట్టు జైమిని సూత్రాలకు భాష్యం వ్రాసేరు. ఆ భాష్యంలో వారు కాళిదాసు వాక్యాన్ని ప్రమాణంగా గ్రహించేరు. దీనిని బట్టి వారు కాళిదాసుకు తరువాతివారని తోలుతోంది. కాగా ఆచార్యులవారు, కుమారిలభట్టు- ఈ ఇద్దరికాలం నిశ్చయింపబడాలి అంటే కాళిదాసు కాలం తెలియాలి. కుమారిలభట్టు కాళిదాసు యొక్క 'అభిజ్ఞాన శాకుంతలం' లోని యీ శ్లోకాన్ని తన భాష్యంలో ఉదహరించేరు.

''....సతాం హి సందేహపదేషు వస్తుషు

ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః''

మనం మనక్షేమంకొరకు ధర్మాన్ని ఆచరించాలి. ధర్మ శాస్త్రాలు పదునాలుగు ఉన్నాయి అవి అన్నీ ధర్మనిరూపణం చేస్తున్నాయి. రూపగ్రహణానికి నేత్రము, శబ్దగ్రహణానికి కర్ణము ప్రమాణంగా ఉన్నాయికదా! 'ఇది ధర్మం' అని నిశ్చయించడానికి ప్రమాణం ఏమిటి? అని విచారిస్తే-

వేదో2ఖిలో ధర్మమూలం శ్రుతిశీలే చ తద్విదాం|

ఆచారశ్చైవ సాధూనాం ఆత్మన స్తుష్టిరేవ చ||

- మనుస్మృతి.

సకలధర్మాలకు మూలమైనది వేదం. దాని తరువాత పేర్కొనదగినవి స్మృతులు. అవి వేదాన్ని అనుసరించియే వ్రాయబడ్డాయి. స్మృతులకు పిదప ప్రమాణభూతమైనది పెద్దల నడవడి. ఇది పురాణములచే తెలియదగినది. వశిష్ఠుడు మొదలగువారి నడవడి పురాణాలద్వారముననే కదా మనం తెలిసికొంటున్నాం. ఆ తరువాత ప్రమాణభూతమైనది శిష్ఠాచారము. అందరి నడవడియు ప్రమాణము కాదు. శిష్టులనడవడి మాత్రమే ప్రమాణభూతము. శాస్త్రవిశ్వాసం కలిగి, శాస్త్రవిహితములైన కర్మలను ఆచరిస్తూ, కామక్రోధరహితులైన వారు శిష్టులు. వారి నడవడి ప్రమాణముగా స్వీకరించదగినది. ఆ తరువాత ప్రమాణమైనది మనస్సాక్షి. మన మనస్సు నిష్కళంకంగా ఆలోచించి ఏమి నిశ్చయింస్తుదో అదికూడా ఒక ప్రమాణం అవుతుంది. ఈ చివరిదైన మనస్సాక్షి ప్రమాణాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తూ కుమారిలభట్టు కాళిదాసు యొక్క శాకుంతలం నుండి పై శ్లోకాన్ని ఉదహరించేడు.

అందుచే ప్రమాణములలో మొదటిది వేదం. దాని పిదప ధర్మశాస్త్రాలు, ఋషుల నడవడి, శిష్టాచారము, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్నే మనం ఆనుసరించాలి. కాని ఈ కాలంలో అన్నీ తలక్రిందు అయిపోయేయి. ఇప్పుడు మొదట మనస్సాక్షి, చిట్టచివర వేదము ప్రమాణం.

వేదమార్గం లేనపుడే మనస్సాక్షిని అనుసరించాలి. మనం దానిని సాక్షి అనే అంటున్నాం. సాక్ష్యం చెప్పడానికే దానికి యోగ్యత ఉన్నది. న్యాయనిర్ణయం చేయగల అధికారం దానికి లేదు. సాక్షిగా వచ్చినవాడు అసత్యాలు కూడా చెప్పవచ్చును. కాని మనస్సు అసత్యం చెప్పదు. నిజం ఏదో అసత్యం ఏదో దానికి తెలుసు. అందుచే మనస్సాక్షికి తోచినట్లు నడచుకొంటాను అనడం పనికి రాదు. ముందగానే మనస్సుకు న్యాయాధికారం ఇవ్వకూడాదు. ఏ గతియు లేకపోయినపుడు మాత్రమే 'నీవు సాక్షిగా ఉండి అన్నీ చూచేవు కదా! అందుచే నీవే సాక్ష్యం చెప్పు'- అని దానిని అడగాలి. అపుడు కూడా అది సాక్షిస్థానంలోనే ఉంటుంది. ఎన్నడును దానికి న్యాయనిర్ణయాధికారం ఈయరాదనియే శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ విషయాన్ని గూర్చి చెపుతూ కుమారిలభట్టు కాళిదాసుయొక్క శ్లోకాన్ని పేర్కొన్నాడు.

అందుచే కుమారిలభట్టుకు సమకాలికులైన ఆచార్యులవారు కాళిదాసుకు తరువాతివారే అయి ఉండాలి. ఆచార్యులవారి కాలాన్ని గురించి 'శివరహస్యం' లో ఆయన కలి ఆరంభించిన తరువాత రెండువేలసంవత్సరాలకు పిదప జన్మించేరని చెప్పబడింది. దానిని అనుసరించి ఆచార్యులవారి కాలం కలికి పిమ్మట రెండువేలకు మూడువేలకు మధ్యమభాగమై క్రీస్తుపూర్వమే అవుతుంది.

కామకోటి మఠము, ద్వారకామఠము, జగన్నాథమఠము - ఈ మూడు మఠాలలోని ఆధారాలను పరిశీలిస్తే ఆచార్యులవారి కాలం నేటికి ఇంచుమించు 2500 సంవత్సరాలకు ముందు అని తేలుతుంది. శృంగేరీమఠంలోని ఆధారాల ప్రకారం వారికాలం నేటికి 1900 సంవత్సరాలకు పూర్వం అని తెలుస్తోంది. కాని ఇలా చెప్పుకొంటే మరొక అసందర్భం ఏర్పడుతుంది.

బుద్దుని కాలం క్రీ||పూ|| 477 వసంవత్సరమని ఒక విధంగా నిశ్చయింపబడి ఉంది. ఆచార్యులవారి బ్రహ్మసూత్రభాష్యంలో బౌధ్దమతఖండనం ఉంది. అందుచే బౌద్ధమతం ఆచార్యులవారికి పూర్వకాలంలోనో లేక సమకాలంలోనో బాగా వ్యాప్తి చెందినదై ఉండాలి. బౌద్ధమతం ఒకటి ఏర్పడి వ్యాపించిన పిమ్మటకదా అది ఖండింపబడడం. ఆచార్యులవారు బ్రహ్మసూత్రాలకు తాము వ్రాసిన భాష్యంలో దాన్ని ఖండించేరు. ఈ లెక్కన చూస్తే బుద్దుడు బ్రహ్మసూత్రాలు మొదటివి భాష్యము, ఖండన తరువాతవి అయి బ్రహ్మసూత్రాలు బుద్ధుడు సమకాలీనులు కావలిసి వస్తోంది. బ్రహ్మసూత్రాల కాలమే బుద్ధుని కాలం అయితే గీతకూడా ఆ కాలానికి సంబంధించినదే కావాలి. ఏమంటే గీతలో భగవానుడు

బ్రహ్మసూత్రపదై శ్చైవ హేతుమద్భిర్వినిశ్చితమ్‌ |

ఋషిభి ర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్‌ ||

- గీత 13-14.

అని బ్రహ్మసూత్రాలను గూర్చి పేర్కొన్నారు. కాగా బుద్ధుడు, బ్రహ్మసూత్రకారుడైన వ్యాసుడు, గీతోపదేష్ట భగవంతుడగు శ్రీకృష్ణుడు ఏకకాలంవారు కావలసివస్తోంది. కాని శ్రీకృష్ణునికాలమూ, భారతకాలమూ ద్వాపరానికి చెందినట్లు చెప్పబడింది. బుద్దునికాలం మాత్రం క్రీ||పూ|| 477వ సంవత్సరం. ఇవన్నీ యిలా సందిగ్ధంగా ఉన్నాయి.

దీనికి రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు. బౌద్ధులు, జైనులు తమ మతాలు బహుకాలంగా సాగి వస్తున్నాయి అంటారు. చరిత్రలో గౌతమబుద్ధుడు మాయాదేవీ శుద్దోదునల సంతానమై ప్రాదుర్భవించినాడని చెప్పబడింది. 'బౌద్ధులు' ఈ గౌతమ బుద్ధునకు పూర్వం చాలామంది బుద్ధులు ఏర్పడ్డారని, బౌద్ధమతం అనాది అని చెపుతారు.

రామాయణంలో కూడా తథాగతుని (బుద్ధుని) ప్రస్తావం ఉంది. తథాగతుని పారద్రోలాలని అందు ఉన్నది. అందుచే వాల్మీకి కాలంలో కూడా బౌద్ధం ఉండి ఉండాలని అనుకొనవలసి వస్తోంది. బుద్ధుని గూర్చి విషయాలు పురాణాలలో ఉన్నాయి. అందుచే చాలామంది బుద్ధులు ఉండి, బుద్దమతం పురాతనమైంది అనుకుంటే బ్రహ్మసూత్రాలలోని బౌద్ధమత ప్రస్తావం సరిపోతుంది. కాని ఆచార్యులవారు తథాగతబుద్ధునకు సమకాలికులు అనడం ఉచితంగా కన్పించదు. ఏమంటే బుద్ధుడు అవతరించాలి. మతం స్థాపించాలి. ఆమతం ప్రశస్తి పొందాలి, దానిని కుమారిలభట్టు అణగద్రొక్కాలి, ఆ తరువాత కదా అచార్యులవారి రాక. కాగా బుద్ధునకు ఆచార్యుల వారి కాలంలో వ్యత్యాసం ఉండి తీరాలి.

బుద్ధుడు క్రీస్తు పూర్వం 477 వ సంవత్సరంలో నిర్యాణం చెందినట్లు చరిత్రశోధన చేసిన ఇతర దేశస్థులు తీర్మానించేరు. అయితే వారలా నిశ్చయించడానికి ఆధారం ఏమిటి? మనం మన పిల్లలకు చిన్నతనంలోనే ఈ చరిత్ర నేర్పుతున్నాం. దానిని వారు అలాగే నమ్ముతున్నారు. వారు పెరిగి పెద్దవారై కూడా చిన్నానాట మనసులో నాటుకొన్న అభిప్రాయాలవంకకే మొగ్గుచూపడం సహజం. విదేశచరిత్రకారులు మన పురాణాలలోని విషయాలు అన్నీ అసత్యాలని, తామ చెప్పునదే సత్యం అని అంటారు. పురాణాలు తప్పులు అనడానికి వారికిగల ఆధారం ఏమిటి? దేనిని చూచి వారు ఇవన్నీ తప్పులు అంటున్నారు? దేనిని చూచి వారు కాలనిర్ణయం చేసేరు? అనే విషయాలు అన్నీ సమగ్రంగా కూలంకషంగా పరిశీలించిన మీదటనే వారి మాటలు విశ్వసించడం తగి ఉంటుంది.

ఆ పాశ్చాత్య చరిత్రకారుల మాటలకు, కాలనిర్ణయానికి ఉండే ఆధారం ఒక్కటే. చంద్రగుప్తుని కాలంలో గ్రీసుదేశం నుండి మెగస్తనీసు అనే రాయబారి మన దేశానికి వచ్చేడు. ఆ రాయబారి కాలాన్ని వారు గుర్తించి ఉన్నారు. దానిని బట్టి చంద్రగుప్తుని కాలము, ఆ చంద్రగుప్తుని బట్టి ఇతరుల కాలము ఒకదానికొకటి పొసగించి వారు లెక్కకడతారు. అందుచే మెగస్తనీసు కాలమే, వాని వ్రాతయే వీరి వ్రాతల కన్నిటికీ మూలంగా కనిపిస్తుంది.

చంద్రగుప్తుడు మగధవంశానికి చెందిన మహారాజు. ఆ రాజుకాలం మన పుస్తకాలలో కూడ గుర్తింపబడి ఉంది. కాని ఆ కాలాన్ని వారు అంగీకరించడం లేదు. అవన్నీ తప్పులు అంటారు. వారి లెక్కలకు ఉండే మూలాధారం తప్పిపోతే వారు చేసిన కాలనిర్ణయాలన్నీ తప్పుతాయికదా! అందుచే మన పుస్తకాలలో చెప్పబడినవానికీ, మెగస్తనీసు వ్రాసిన వ్రాతలకూ ఒక సమాధానం కుదురుతుందేమో చూడాలి. సమాధానం కుదిరితే ఆ పాశ్చాత్యుల మాటలు అన్నీ పొల్లుగా తేలుతాయి.

మెగస్తనీసు తన వ్రాతలో 'చంద్రకోటన్‌' అనే రాజును గూర్చి పేర్కొన్నాడు. విదేశచరిత్రకారులు చంద్రగుప్తుడే మెగస్తనీసుచే పేర్కొన్నబడ్డ 'చంద్రకోటన్‌' అని నిశ్చయించేరు.

మగధను పాలించిన వారిలో సముద్రగుప్తుడు అనే రాజొకడు ఉన్నాడు. ఆ సముద్రగుప్తని పేరునే మెగస్తనీసు 'చంద్రకోటన్‌' అని వ్రాసినాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. చంద్రగుప్తుడు సముద్రగుప్తునికి చాలా పూర్వుడు, ఆ చంద్రగుప్తుని కుమారుడే అశోకుడు. అశోకుని కాలంలో బుద్ధుడు ఉన్నాడు. దానిని బట్టి బుద్దుని కాలం ఇది అని వారు లెక్కిస్తారు.

మెగస్తనీసు వ్రాసిన 'చంద్రకోటన్‌' సముద్రగుప్తుడే అయినచో లెక్కలన్నీ వేయిసంవత్సరాలు పూర్వానికి జరిగిపోతాయి. ఈ విషయం నేను బాగా శోధించలేదు. చారిత్రకులు దీనిని గమనించాలి. మెగస్తనీసు వ్రాసిన 'చంద్రకోటన్‌' చంద్రగుప్తుడే అని మొదట వ్రాసిన చారిత్రకులు 'విల్సన్‌' ఆయన చెప్పిన మాట తప్పు అని మనం ఆయనను దూషించనూ కూడదు, ఆయన చెప్పేడుకదా అని విమర్శించకుండా దానిని విశ్వసించుటయూ కూడదు. వారు ఏ ఆధారంతో ఈ మాట చెపుతూ ఉన్నారన్నదానిని గూర్చి పరిశోధించాలి.

సంఘసంస్కర్తలు మన ధర్మ శాస్త్రాలను అలక్ష్యం చేస్తారు. చారిత్రకులు మన లెక్కలను అలక్ష్యం చేస్తారు. సంఘసంస్కర్తలు ఇహలోకసుఖం ఉంటేచాలు అంటారు. పరలోకసుఖాన్ని గూర్చి వారు ఆలోచన చేయరు. ధర్మ శాస్త్రాలు పరలోకసుఖాన్ని కూడా సంపాదిస్తాయి అనే విషయాన్ని వారు గ్రహించరు. వారు శాస్త్రాలన్నీ తప్పు, అవి చెప్పే మాటలన్నీ మూఢవిశ్వాసాలు అని వారు ముందే ఒక తీర్మానం చేసి తరువాత మాటలాడ నారంభిస్తారు. ఆస్తికబుద్ది, పాపపుణ్యజ్ఞానము, శిష్టాచారసంపద, పురాణాది పరిజ్ఞానము చిన్నతనమునుండి వారిలో ఏర్పడిఉంటే ఇలా తొందరపాటుతో అన్నీ తప్పులే అని వారు చెప్పుటకు సాహసించరు.

కాలాన్ని బట్టి చరిత్రమారుతూ ఉంటుంది కదా, అలాగే శ్రుతి స్మృతి పురాణాలు కూడా కాలానుసారంగా మారుతూ ఉండాలని సంఘంస్కర్తల అభిప్రాయం. శృతి స్మృతి పురాణాదులు కేవలం సామాజికజీవనానికి సంబంధించినదిగా ఉంటే అవి కాలానుకూలంగా మార్పు చెందవచ్చు. కాని ఆత్మార్థములై ఉన్నవానికి మార్పేమిటి? ఆత్మ సంబంధమైనవి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి, అవి మారవు. కాని సంఘసంస్కర్తలు ఏ ఆలోచనయు చేయకుండగనే 'ఇవన్నీ తప్పు ఇవి మారాలి' అంటారు. ఇక చారిత్రకులు వేదములలోకూడా కాలానుకూల పరిణామాలు గోచరిస్తున్నాయి అంటారు. మనకు ప్రధానమైనది ధర్మం. దానినే గ్రహించాలి. చరిత్రలో ఎన్నో తప్పులు వ్రాయబడ్డాయి. అయినా మనం దానిని నమ్ముతాం.

ఇట్టి నమ్మకాలతోడనే ఏదికావాలి అన్నా ఒకశాసనం చేయడం. దానిని అమలుపరచడం చేస్తూ ఉంటాము. ఇదంతా ఇంగ్లీషుచదువుల వల్ల వచ్చిన అనర్థం. శాస్త్రాలను నిరసించే ఈ అందరూ ఆ గ్రంథాలు చదివేరా? అ అనుష్ఠానాలు చేసేరా? లేదే! అయినా వారు ఏ జంకూ లేకుండా ఇవన్నీ తప్పులు అంటున్నారు. విదేశీయుల విధానాలను అనుసరిస్తున్నారు. కాని తత్వాలోచన చేయడంలేదు. గంభీరవిషయాన్ని కూడా తేలికగా చూడడం అలవాటు అయిపోయింది. సముద్రగుప్తుడే మెగస్తనీసుచే పేర్కొనబడిన 'చంద్రకోటన్‌' అయితే కాలనిర్ణయంలో ఎంత వ్యత్యాసం వస్తోంది? ఈ విషయాన్ని తేలికగా తీసివేయక చారిత్రకులు పరిశీలించాలి.

కాశిదాసకవి కాలం తెలిస్తే ఆచార్యుల కాలాన్ని విశ్చయించవచ్చు అని వెనుక చెప్పబడింది. రవికీర్తి అనే ఒకరాజు కాలంలో ఏర్పడిన ఒకశాసనంలో కాళిదాసభారవుల పేర్లు కన్పిస్తున్నాయి. ఆ రవికీర్తి స్యయంగా ఒక కవి. శాసన శ్లోకంలో రవికీర్తి కాళిదాస భారవులకు సమానమైన కీర్తి కలవాడని చెప్పబడింది.

'సవిజయతి రవికీర్తిః, కవితాశ్రిత కాళిదాస భారవికీర్తిః'

ఆచార్యులవారికి ఐదవయేట ఉపనయనం అయింది. ఉపనయనము 'కామ్యోపనయనము, నిత్యోపనయనము' అని రెండు రకాలు. ఏడవేట అనగా గర్భాష్టమమందు ఉపనయనం చేయాలి. బ్రహ్మతేజాన్ని అభ్యర్థించేవారు. ఐదవయేటనే ఉపనయనం చేయాలి.

ఆచార్యులవారు మూడేండ్లువయసునాటికే దేశభాషలు నేర్చుకొన్నారు. ఐదేండ్లవయసు వచ్చేసరికి వారు సంస్కృత భాషను చక్కగా అభ్యసించేరు. ఉపనీతులైన తరువాత ఎనిమిదవ ఏడు వచ్చులోగా వేదశాస్త్రాలు అభ్యసించేరు. ఉపనీతులై వారు గురుకులవాసం చేసేరు. ఎనమిదవయేటికి ఇంటికి తిరిగి వచ్చేరు. అప్పటికి వారి తండ్రి దివంగతు లయ్యేరు. అపుడు ఆచార్యులవారు తాము కేవలం ఇంటిలో కూర్చుండుటకు కాక లోకాన్ని ఉద్ధరించుటకు వచ్చితిమని భావించేరు. ఈ లోకోద్ధరణకార్యాన్ని కొనసాగించడానికి సంన్యాసం స్వీకరించవలెనని వారు నిశ్చయించుకొన్నారు. అయితే వారి తల్లి తనకీయన ఒక్కడే కుమారుడు అయినందున వీరికి వివాహము చేయవలె నన్న ఆలోచనలో ఉన్నారు. అందుచే ఆచార్యులవారు తమ తల్లితో 'అమ్మా! నేను సంన్యాసము తీసికొంటాను, అని చెపితే ఆమెకు దుఃఖం కలుగుతుందని సంశయించసాగేరు.

ఒకనాడు వారి తల్లికి దేహం అస్వస్థంగా ఉంది. ఆమె కుమారునితో - 'నాయనా! నాకు నేడు నదికి వేళ్ళే ఓపిక లేదు- అన్నది. అపుడు వారు దూరంగా ఉన్న నది ఇంటికి చేరువగా రావాలని ప్రార్థించేరు. ఆయన ప్రార్థించినట్లు నది యింటికి దగ్గరగా వచ్చింది. దారిలో ఒక కృష్ణాలయం ఉంది. నదీవేగానికి ఆ ఆలయం కూలిపోయింది. కాలాంతరంలో ఆచార్యులవారు ఆజ్ఞాపించగా ఒక దేశపురాజు దానిని పునరుద్ధరించేడు.

ఆచార్యులవారు తమతల్లిని నదిలో స్నానం చేయించేరు. తరువాత తాము స్నానం చేయడానికై నదిలోకి దిగేరు. వారునీటిలో అడుగు పెట్టగానే ఒక మొసలి వారి పాదం పట్టుకొంది; అపుడు ఆయన తల్లితో - 'ఇదుగో! మొసలి పట్టుకొన్నది, ఇప్పుడు నా ప్రాణాలు పోవడం నిశ్చయం మానసికంగా సంన్యాసం స్వీకరించానా నాకు వేరొక జన్మ వచ్చినట్లు అవుతుంది; నాప్రారబ్ధము మారిపోతుంది, కాగా ప్రారబ్ధముచే వచ్చిన మరణంకూడా మారిపోవచ్చు; తల్లివి, నీవు ఆజ్ఞాపించకుండా నేను సంన్యాసం తీసికొనకూడదు, సంన్యాసం తీసికొంటే ఒకవేళ నేను బ్రతుకుతానేమో కాని, తీసికోకపోతే నాకు చావు తప్పదు; ఇది దుర్మరణం; నేను ఇలా మరణిస్తే నీకు పుత్రకార్యాలు ఉండవు; సంన్యాసము తీసికొంటే నాకు మోక్షము వస్తుంది; నీకు సద్గతి కలుగుతుంది; సంన్యసించినా నేను నీకు అంత్యక్రియలు చేస్తాను' అన్నారు.

ఆచార్యులవారు జలంలో ఉండియే సంన్యాసం స్వీకరించాలనుకొన్నారు. ఆయన అలా అనుకొనుటతోడెనే మొసలి ఆయన కాలిని విడిచిపెట్టింది. ఆ క్షణంలోనే ఆకాశంలో రథంమీద ఒక గంధర్వుడు ప్రత్యక్షం ఆయ్యేడు. అతడు ఆచార్యుల పాదాలమీదపడి నమస్కరించేడు. ఆచార్యుల వారికి ఆశ్చర్యం కలిగింది. తానొక గంధర్వుడనని అతడు చెప్పుకోన్నాడు.

గంధర్వులు దివ్యదృష్టి కలవారు. దేవజాతిలో వారిది ఒక తెగ. గంధర్వలు సదా ఉత్సాహంగా ఉంటారు. సంగీతం, మధ్యం, ఇవి రెండూ వారికి చాలా ప్రీతిపాత్రవస్తువులు. అందుచేతనే సంగీతానికి 'గాంధర్వవేదం' అనే పేరు ఏర్పడ్డది.

ఆ గంధర్వుడు ఆచార్యులవారితోఅయ్యా! నేను ఒకప్పుడు బాగా మద్యం సేవించి గానలోలుడనై కదలకుండా పడిఉన్నాను. ఆసమయంలో దూర్వాసమహరి అలా వచ్చేరు. ఆయనకు మద్యము, సంగీతము రెండును కిట్టవు. ఆయనను చూచి నేను లేవలేదు; నా గానాన్ని విరమించలేదు. దానికి ఆ మహరి కోపించినీవు త్రాగి మొసలివలె పడి ఉన్నావు. అందుచే నీవు మొసలివై పడిఉండు! అని శపించేరు. అప్పుడు నేను వారిని ప్రార్ధించేను. 'ఈ శాపాన్ని అనుసరించి నీవు కొంతకాలం మొసలివై పడి ఉండక తప్పదు, ఈశ్వరుడు ఈ లోకంలో అవతరిస్తాడు, ఆయన కాలినిపట్టుకొన్నపుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీవు కాలడిలో నివసించు, ఈశ్వరుడు అచ్చటనే అవతరిస్తారు, నిన్ను అనుగ్రహిస్తాడు' అని దుర్వాసమహంితుడయ్యేడు.

మొసలి నోటినుండి విడువడిన కుమారుని చూడగానే తల్లికి చాలా ఆనందం కలిగింది, ఆమెరా! నాయానా ! ఇక నీవు పెండ్లి చేసికొనవచ్చును, తగిన కన్యను చూస్తానుఅని ఆరంభించింది.

ఇది విని ఆచార్యులవారు- 'తల్లీ! నేటినుండి నేనొక యింటిక సంబంధించిన బిడ్డను కాను. అన్ని యిళ్లు నాకు సొంతమే. సంన్యాసము తీసుకొనడానికి నీవు నాకు అనుమతి ఇచ్చేవు; ఆ విషయం మరచితివేమో! నేనింక ఇచ్చటనుండి వెళ్లిపోవాలి' అని ఆమెకు నమస్కరించేరు.

'సర్వవంద్యేన యతినా ప్రసూ ర్వంద్యా హి పాదరం' అందరూ సంన్యాసికి నమస్కరిస్తే సంన్యాసి తల్లికి నమస్కరించాలి. పిమ్మట ఆచార్యులవారు ఇక తనకు తల్లి, తండ్రి, కుమారుడు ఎవరూ లేరని భావించేరు.

భిక్షప్రదా జనన్యః పితరొ గురవః కుమారకాః శిష్యాః|

ఏకాంతరమణ హేతుః శాంతి ర్దయితా విరక్తస్య||

- వైరాగ్య శతకము.

''సంన్యాసినైన నాకు భిక్షచేసేవారే తల్లులు. జ్ఞానోపదేష్టలైన గురువులే తండ్రులు; శిష్యులే కుమారులునేను ఈ విశ్వకుటుంబానికి చెందిన వాడను'' అని ఆచార్యులవారు తల్లితో చెపుతూఏమైనా నీవు నన్ను తలచగానే నేను నీ దగ్గరకు వస్తాను' అని ఆమెకు నచ్చజెప్పి సక్రమ సంన్యాసస్వీకారానికి యోగ్యగురువును అన్వేషిస్తూ బయలుదేరేరు.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page